శాంతి
ఉగ్రవాదుల దాడులను ఆపడానికి మనం గొప్పగా ఏమి చేయాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఎన్నో దాడులు జరిగాయి ఇలా ఇక ముందు కాకూడదు అంటే మనం మనుషుల్లా మసులుకుంటే చాలు. పారిస్ లో జరిగిన దాడులకు స్పందిస్తూ నేనూ ఒక మనిషిగా చేసిన చిన్న ప్రయత్నం.
ఎందరో ఎగరేసిన శాంతి కపోతం,
అయ్యిందిప్పుడు శోకిస్తున ఎర్రని పతాకం,
మొన్నటి ఆ అమెరికా లో,
నిన్నటి మన భారతం లో,
నేటి ఈ పారిస్ లో,
ఎగిసే అణుబాంబుల జ్వాల,
వేస్తుంది మనవతానికి జాల,
మోగే ప్రతి ఫిరంగి మోత,
మరొక యుద్దానికి తెరతీత,
వచ్చే తుపాకి గుండ్లు, పోయే ప్రాణాలు,
ఇలా లేక్కేస్తూ పోతే, తేలవు ఈ లెక్కలు.
ఇంకా ఎంతకాలం ఈ మారణకాండ.
ఫేసుబుక్కులో ముఖచిత్రాలను,
ముచ్చటగా పెడతావు.
అన్యాయాన్ని అరడజను పేజీలలో,
అందంగా చదువుతావు.
చలించని మనసుతో
చలనచిత్రాలను చూస్తావు.
ఎక్కడ నేర్చావు రా ఇదంతా!
అమ్మ చూపే ప్రేమలోనా,
నాన్న చెప్పే కథలలోనా ,
పంతులు చెప్పే పాఠాలలోనా,
పండితుడు చెప్పే బోధల్లోనా,
కాదు కదా!
ఇది కాదు నీవు చెయ్యాల్సిన కార్యం,
రమ్మంటే రాదు రంగుల లోకం.
కలపాలి నీ చెయ్యిని ఆ చెయ్యితో,
కావాలంటే కాదు పచ్చని ప్రపంచం,
కురిపించాలి కరుణ రసం.
సాధించాలంటే స్వచ్ఛని జగత్తు,
వదిలెయ్యాలి ఆక్రోష, క్రొధాలన్నీ.
నీవెందుకు కాకూడదు,
మరో మండేలా, గాంధీగా
నీవెందుకు కాకూడదు,
తెల్లని పావురపు ప్రతినిధిగా.
నీకు వచ్చింది స్వేచ్ఛ,
కానీ అయ్యావు భావాలకు బానిస.
దర్శించు, స్మరించు ఈ భావాలను,
కులంలోని అర్థాన్ని,
మతంలోని మాటలని
జీవనంలోని సత్యాన్ని,
సాటివరిలోని స్నేహాన్ని,
అభాగ్యులలోని భాగ్యాన్ని,
అమ్మాయిలోని అమ్మతనాన్ని,
వృద్ధులలోని దైవత్వాన్ని,
దర్శిస్తూ, స్మరిస్తూ,
సాగించు నీ బ్రతుకు పయణం.
అప్పుడు కదా!
ప్రపంచానికి శాంతి కలిగేది,
పృథ్వీ తల్లి పులకించేది.
© క్రాంతి కిరణ్ ఏలె
౨౦/౧౧/౨౦౧౫
Super mama
ReplyDelete